5 May, 2026 | 3:36 AM

రాష్ట్రంలో మార్పు తథ్యం

05-05-2026 12:39 AM
  1. ఐదు రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  3. రేవంత్‌రెడ్డికి కూడా గుణపాఠం తప్పదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ 
  4. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు
  5. పెరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ సభకు భూమి పూజ

సికింద్రాబాద్, మే 4 (విజయక్రాంతి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేశారు. గత 33 ఏళ్లు కమ్యూనిస్టులు, 15 ఏళ్లు తృణమూల్ పాలించిన పశ్చిమ బెంగాల్ కోటలో బీజేపీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఎంసీ రెండు పార్టీలు ఓడిపోతే ఈవీఎంల మీద, సంస్థల మీద వంకలు పెట్టి ఆరోపణలు చేస్తారని అన్నారు.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సంబురాల్లో ఎంపీ లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని స్వీట్లు తినిపించుకున్నారు. అలాగే కూకట్‌పల్లి నుంచి పలువురు వైద్యులు, మైనార్టీలు రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్‌లో మోదీ సభ ఏర్పాట్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

ఉత్తరాది, దక్షిణాది వైషమ్యా లు సృష్టించిన ఇండియా కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా రాజకీయంగా పెద్ద మార్పు రావాలని, ప్రజలు బీజేపీ వైపు నిలుస్తారని బలంగా విశ్వసిస్తున్నామని చెప్పారు.

10న పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు 2 లక్షల మందికిపైగా కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారని వెల్లడించారు. మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ చట్టం ఎంతో కీలకమైనదని, ఈ బిల్లుకు ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఉంటే, దేశంలో ముఖ్యంగా ముస్లిం మహిళలకు మరింత రాజకీయ అవకాశాలు లభించేవన్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలే ఉండాలనే యావతో మహిళలకు అవకాశాలు లభించకూడదనే ఆలోచనతో వారు అడ్డంకులు సృష్టించారన్నారు. 

రాజకీయాలలో పెను మార్పు: ఎంపీ లక్ష్మణ్ 

తెలంగాణ రాజకీయాలలో పెను మార్పు సంభవించబోతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మహిళా బిల్లుని అడ్డుకున్న స్టాలిన్‌కు తమిళనాడులో కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. రేవంత్‌రెడ్డికి కూడా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. టీఎంసీ రాక్షస పాలన నుండి విముక్తులమయ్యామని, బెంగాల్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా అన్ని రాష్ట్రాల్లో మోదీ అభివృద్ధి దిశగా పాలన చేస్తున్నారని తెలిపారు.

పదేండ్లు తెలంగాణలో ఒకే కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీ పెద్దల కోసం దోచి పెడుతున్నారని ఆరోపించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలు బెంగాల్‌లో మోదీ నెరవేర్చారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అక్కడ పేదవారికి చేయూత దొరుకుతుందని ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దశ దిశా చూపించడానికి మోదీ తెలంగాణకు వస్తున్నారని చెప్పారు.