19 August, 2026 | 4:10 PM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

19-08-2026 02:32 PM

ఉట్నూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. రేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆహార భద్రతతో పాటు అనేక ప్రయోజనాలకు ఇది కీలక ఆధారమని అన్నారు.

గత పదేళ్ల పాలనలో అర్హత ఉన్న అనేక కుటుంబాలకు రేషన్ కార్డులు అందకపోవడంతో వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి వారికి రేషన్ కార్డులు అందించే ప్రక్రియను చేపట్టామని ఎమ్మెల్యే గారు  పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పదేళ్ల పాటు ప్రజలను నిరీక్షింపజేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. అర్హత ఉన్నప్పటికీ L3 కేటగిరీలో పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్ల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లి, వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఉట్నూర్ మండలంలో 32 రేషన్ షాపుల పరిధిలో మొత్తం 18,784 రేషన్ కార్డులు ఉన్నాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఉట్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 4 రేషన్ షాపుల పరిధిలో 4,110 రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిత శ్రీనివాస్, PACS చైర్మన్ ఎస్.పీ. రెడ్డి, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.