25 April, 2026 | 7:32 PM

సీజీఆర్ కార్యాలయం అంటే జనతా గ్యారేజ్..

25-04-2026 05:58 PM

- పార్టీలకు అతీతంగా 24 గంటల సేవలు

- వ్యక్తిగత విమర్శలు మానుకోండి 

- అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన

- అటు జిఎంఆర్ ఇటు సిజి ఆర్ 

గుమ్మడిదల: రాజకీయం అంటే ప్రజల కోసం పని చేయడమే అని,వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సీజీఆర్ కార్యాలయం సాధారణ కార్యాలయం కాదని, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే జనతా గ్యారేజ్ అని చెప్పారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై స్పందించారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా సీజీఆర్ కార్యాలయంలోనే పరిష్కారం లభిస్తుందని, పార్టీలతో సంబంధం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు.

రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పఠాన్‌చెరులో ప్రజలు వారిని నమ్మలేదని,ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ నాయకులనే గెలిపించారని పేర్కొన్నారు. గుమ్మడిదల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ప్రజల్లో ఉండి పని చేస్తేనే విశ్వాసం వస్తుందని చెప్పారు. గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్‌గా ఉన్నప్పుడు సస్పెండ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తూ,తాము అలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని తెలిపారు.

పదవీకాలం పూర్తి చేసి మళ్లీ ప్రజల మద్దతుతో గెలుస్తున్నామని చెప్పారు. పఠాన్‌చెరులో ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రజలకు అండగా ఉన్నారని,గుమ్మడిదలలో సీజీఆర్ నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. జీఎంఆర్ తమకు పెద్దన్నలాంటివారని చెప్పారు.  ప్రజల సేవే తమ లక్ష్యమని, రాజకీయాల పేరుతో వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ ,మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.