డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదిపై కేంద్రం కుట్ర, మహిళా బిల్లు ఒక ఎన్నికల గారడీ
కల్లూరి మల్లేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
చౌటుప్పల్,(విజయ క్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చౌటుప్పల్‌లో సిపిఎం మండల , పట్టణ కమిటి ఆధ్వర్యంలో శనివారం రోజున స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో నిర్వహించిన సెమినార్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కల్లూరి మల్లేశం మాట్లాడుతూ జనాభా నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు డీలిమిటేషన్ ఒక శాపంగా మారబోతోందనీ , జనాభాను విచ్చల విడిగా పెంచిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెంచి, నిబంధనలు పాటించిన దక్షణాది రాష్ట్రాల సీట్లు తగ్గించడం అంటే.. అభివృద్ధిని అగౌరవపరచడమే అన్నారు.
ఇది ముమ్మాటికీ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వంపై కేంద్రం చేస్తున్న దాడి అని మల్లేశం విమర్శించారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని ఆయన ప్రశ్నించారు. మహిళా బిల్లును -2023 సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదించిన నుండి అమలు చేయకుండా చేతులు దులుపుకునీ ,జనాభా గణన, డీలిమిటేషన్ వంటి అంశాలకు ముడి పెట్టి మహిళలను మోసం చేస్తున్నది బిజెపి అని విమర్శించారు. మహిళా శక్తిని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న బీజేపీ, తక్షణమే ఈ కోటాను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ డ్రామాలు ఆడుతోంది, అని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా ,రాయగిరి కిష్టయ్య, పట్టణ కార్యదర్శి గోశిక కరుణాకర్, సిపిఎం సీనియర్ నాయకులు ఆదిమూలం నందీశ్వర్, చెరుకు లక్ష్మమ్మ, కొంతం సుశీల తదితరులు పాల్గొన్నారు.






