4 April, 2026 | 6:32 PM

గ్రామ ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం

04-04-2026 05:25 PM

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

కల్వకుర్తి: గ్రామ ప్రజల సురక్షిత భద్రతకు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం కల్వకుర్తి మండలంలోని తాండ్రా గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి,తన సొంత నిధులు రూ.12 లక్షల, 50 వేలతో ఏర్పాటు చేసిన 67 సీసీ కెమెరాలను, గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సీసీ కెమెరాల నీఘాలో గ్రామాలు సురక్షితంగా ఉంటాయన్నారు. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయని తెలిపారు. గ్రామంలో ఒక్క సీసీ కెమెరా వంద మంది భద్రతా సిబ్బందితో సమానమని అన్నారు. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి అందిస్తున్న సేవలను కలెక్టర్ అభినందించారు. రూ.70 లక్షలతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించి, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

అనంతరం గ్రామంలో రూ.5 కోట్లుతో నిర్మించనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల నిర్మాణ పనులను వేగవంతంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వెంటనే పూర్తి చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.