4 April, 2026 | 8:12 PM

ఆన్‌లైన్‌లో సులభంగా “మన ఇసుక వాహనం” సేవలు

04-04-2026 06:26 PM

తహశీల్దార్ లక్ష్మారెడ్డి

హుస్నాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పనులు, వ్యక్తిగత అవసరాల కోసం ఇసుకను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం “మన ఇసుక వాహనం” పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని హుస్నాబాద్ తహసిల్దార్ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ విధానం ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించారని,

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని “ఇసుక బుకింగ్” ఎంపిక ద్వారా తమ అవసరానికి అనుగుణంగా ఇసుకను బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం “కొత్త బుకింగ్” ద్వారా కొత్త ఆర్డర్ నమోదు చేయవచ్చని తెలిపారు. అవసరమైన వివరాలను సమర్పించిన తర్వాత చెల్లింపు పూర్తి చేస్తే ఇసుక సరఫరా ప్రక్రియ ప్రారంభమవుతుందని

ఈ విధానం ద్వారా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, వ్యక్తిగత గృహ వినియోగదారులు, అలాగే ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక సరఫరా సులభతరం కానుందని చెప్పారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం, ఈ సేవలను వినియోగించుకునే వారు నిర్ణీత నిబంధనలు పాటించాలన్నారు. అదేవిధంగా, అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం, పారదర్శకతను పెంచడం, వినియోగదారులకు సమయానికి సరఫరా చేయడం ఈ కొత్త విధానం ముఖ్య లక్ష్యాలుగా అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా సందేహాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు.