4 April, 2026 | 8:02 PM

మంత్రి జూపల్లి నియోజకవర్గంలో జోరుగా నాటు సారా దందా.!

04-04-2026 06:31 PM

- అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు 

కొల్లాపూర్ టౌన్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో నాటు సారా దందా(Natu Sara Mafia) జోరుగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Excise Minister Jupally Krishna Rao) సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉండటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండలాలు, గ్రామాల్లో నాటు సారా విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్ మండలాల పరిధిలోని తండాల నుంచి తెల్లవారుజామునే స్కూటీలు, బైక్‌లపై స్కూల్ బ్యాగుల్లో పెట్టుకొని నాటు సారాను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో కూడా ఓ మహిళ స్కూల్ బ్యాగ్‌తోనే పట్టపగలు నాటు సారా సరఫరా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గ్రామాల్లో నాటు సారా సేవనం పెరగడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటు సారా కారణంగా ప్రతి ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు కఠిన చర్యలు తీసుకుని నాటు సారా దందాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.