4 April, 2026 | 7:02 PM

చెత్తను తొలగించకపోతే నిరాహార దీక్ష

04-04-2026 05:28 PM

కౌన్సిలర్ పులిపాటి

గద్వాల టౌన్: చెత్తను వెంటనే తొలగించకపోతే ఇక్కడే నిరాహార దీక్ష చేపడతానని పట్టణంలోని 21వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డు పరిధిలోని ఈదమ్మ గుడి, పశువుల ఆసుపత్రి సమీపంలో భారీగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు తరచూ సంచరించే ప్రధాన రహదారే అయినప్పటికీ సమస్యను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. చెత్త కారణంగా రహదారిలో వెళ్లే వారు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు .ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని,లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిరాహార దీక్షకు దిగుతానని కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ స్పష్టం చేశారు.ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.