4 April, 2026 | 7:54 PM

శాతవాహన వీసీ అక్రమాలపై ఎంక్వైరీ చేయాలి

04-04-2026 06:12 PM

యూనివర్సిటీలో అక్రమాలను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లని వేధించడం తగదు

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

కరీంమగర్,(విజయాక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, ఉద్యోగాల నియామకం, ఇతర అభివృద్ధి పనుల్లో  అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ల నిందలు వేస్తున్నారని, నిరాధార ఆరోపణలతో యూనివర్సిటీ అకడమిక్ వాతావరణాన్ని దెబ్బ తీస్తున్న వ్యక్తులపై వీసీ, రిజిస్ట్రార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 

పోలీస్ ఉన్నతాధికారులు ఒకవైపు కరీంనగర్ లో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై యూనివర్సిటీ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ప్రచారంతో వచ్చే విద్యా సంవత్సరం యూనివర్సిటీకి కొత్త అడ్మిషన్లు తీసుకోవడానికి విద్యార్థులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని, యూనివర్సిటీలో ఒకరిద్దరు అధికారుల ఇష్టానుసార నిర్ణయాలు, ఇష్టానుసార నియామకాలు కొత్త నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

యూనివర్సిటీలో ఫుల్ ఈసీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని,  ఇలాంటి అవకతవకలను ప్రశ్నిస్తే ఇలా అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ ప్రకటనలు చేయడం ద్వారా యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై సమీక్ష నిర్వహించి యూనివర్సిటీలో తప్పులు చేస్తూ ఇష్టానుసారం వివరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వెంటనే శాతవాహన యూనివర్సిటీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై సిట్టింగ్ చేతితో విచారణ జరిపించాలని మణికంఠ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.