23 May, 2026 | 1:56 PM

క్రిమి సంహారకాల వినియోగంలో జాగ్రత్త వహించాలి

23-05-2026 12:49 PM

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 

బోధన్: మే23(విజయక్రాంతి): ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సమన్వయంతో ముప్కాల్ మండల కేంద్రం లోని వేంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎం సాయి చరణ్, కీటక శాస్త్రవేత్త మాట్లాడుతూ, రైతులు లింగాకార్షక బుట్టలను ఉపయోగించి పురుగుల ఉదృతిని గుర్తించి, సమగ్ర సస్య రక్షణ చర్యలను చేపట్టాలని తెలిపారు. వేపనూనె, అజాడిరక్తిన్ మందులను పంటలపై పురుగుల గుడ్ల సమూహలాను, తొలి దశ లార్వల నివారణకు ఉపయోగించాలని,పురుగులు ఆర్థిక పరిమిత స్థాయిని దాటినప్పుడు ఆఖరి అస్త్రంగా మాత్రమే రసాయన మందులు జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.

యూరియా సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగించాలని, నానో యూరియా వాడకం పెంచాలని తెలిపారు. జి. సాయి కృష్ణ, మండల వ్యవసాయ అధికారి, రైతులు ప్రభుత్వం సూచించిన, మార్కెట్ లో గిరాకి ఉన్న రకాలను సాగు చేయాలని, పచ్చి రొట్ట పంటలను సాగు చేయాలని, సేంద్రియ వ్యవసాయం గురించి చర్చించారు. అత్తం మహేష్, గ్రామ సర్పంచ్ రైతులనిద్దేశించి మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి, అందుబాటులో ఉన్న ఆధునిక విధానాలను ఉపయోగిస్తూ అధిక దిగుబడి మరియు నికర ఆదాయం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో  కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్-జక్కా రాజేశ్వర్, గ్రామ ఉపసర్పంచ్ - జె. సునీత, సొసైటీ డైరెక్టర్ - పరమేశ్వర్, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.