జామ్‌గావ్‌లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
ఆధునిక సాగుపై 38 మంది రైతులకు అవగాహన
జైనూర్, మే 23 (విజయక్రాంతి): జైనూర్ మండలం జామ్‌గావ్ గ్రామంలో శనివారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన శాస్త్రవేత్తలు నేరుగా పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో 15 మంది పురుష రైతులు, 23 మంది మహిళా రైతులు మొత్తం 38 మంది పాల్గొన్నారు. పంటలకు సోకే చీడపీడల నివారణ, పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పీపీఈ కిట్ల వాడకం గురించి శాస్త్రవేత్తలు వివరించారు.
వరి, పత్తి, పప్పు ధాన్యాల్లో అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అంతర పంటల వల్ల కలిగే లాభాలు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, యూరియా వాడకంలో మెళకువలు, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంతో నేల సారాన్ని పెంచుకునే విధానాలను సూచించారు. కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ డా. సి.వి. సమీర్ కుమార్, కీటక శాస్త్ర విభాగం టీచింగ్ అసోసియేట్ డా. కె. సతీష్, ఏఈవో రాము పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ పి. అనసూయతో పాటు ప్రగతిశీల రైతులు ఆత్రం దిలీప్, మాణిక్‌రావు హాజరయ్యారు.






