ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆలేరు,(విజయక్రాంతి): నిన్న జరిగిన ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కార్యక్రమంలో నన్ను విమర్శించడం ప్రతిపక్షాలకు తగదని స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈరోజు ఆలేరులో స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని తాను అసెంబ్లీలో రెండు సార్లు మాట్లాడానని, దానికి సంబంధించిన రికార్డు కూడా ఉందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 12 రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదించగా అందులో ఆలేరు పేరు కూడా ఉందని, ఆలేరు రెవెన్యూ డివిజన్ కోసం తన వంతు కృషి తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలకు ఈ విషయంపై అవగాహన లేదని మండిపడ్డారు.
నేడు టీఆర్ఎస్ - బీజేపీ పొత్తు పెట్టుకుని రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడుతున్నారని, 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ హయాంలో అనేక రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయని, అప్పుడు ఆలేరును ఎందుకు రెవెన్యూ డివిజన్ గా మార్చలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడడం బీఆర్ఎస్ పార్టీకి సిగ్గుచేటన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఆలేరు నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గంగానే ఉంటుందని, రెవెన్యూ డివిజన్ ను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండ్రు శోభారాణి, జనగామ ఉపేందర్ రెడ్డి, డివిజన్ బాలమణి, గంధముల అశోక్, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.






