13 July, 2026 | 3:28 AM

మేడారంలో భక్తుల సందడి

13-07-2026 01:30 AM

మేడారం, జులై 12 (విజయక్రాంతి): మేడారంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వ్యవసాయ పనుల ప్రారంభం నేపథ్యం, విద్యా విద్యాలయాలు ప్రారంభమై నెలరోజులు కావస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తమ కుటుంబ సభ్యులతో సహా వనదేవతలను దర్శించుకోవడానికి మేడారం తరలివచ్చారు. సుమారు లక్షకు పైగా భక్తులు మనదేవతల సన్నిధికి చేరుకోవడంతో మేడారంలో భక్తుల కోలాహలం నెలకొంది. వనదేవతలకు భక్తులు ఎత్తు బంగా రం (బెల్లం), కొబ్బరికాయలు, చీరేసారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

చాలామంది భక్తులు తలనీలాలు సమర్పించారు. జంపన్న వాగులో ఉన్న కొద్దిపాటి నీటిలో పుణ్యస్నానం ఆచరించడంతో పాటు కొందరు ఉన్న ఒక్కగానొక్క నీటి షవర్ వద్ద స్నానాలు ఆచరించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకొని చల్లగా చూడాలని వేడుకున్నారు. విపరీతమైన ఎండ నేపథ్యంలో గద్దెల పైన భక్తులకు ఎండ వేడి తాగకుండా వెదురు తడకలతో పందిరి ఏర్పాటు చేసినప్పటికీ గద్దెల ప్రాంగణంలో నీడ లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాతి కట్టడాలతో గద్దె ల ప్రాంగణాన్ని పునరుద్ధరించడంతో ఎండ తీవ్రత నేపథ్యంలో భక్తులు అవస్థలు పడుతున్నారు.