పేట బస్టాండ్‌కు బస్సుల పరుగు!
నవాబ్పేట బస్టాండుకు పునర్ వైభవం
ప్రయాణికుల సంబరం
నవాబ్ పేట, జూలై 1: అదేంటి బస్టాండుకు బస్సు రావడం ఏంటి మరి బస్సులు ఎక్కడికి పోతాయి అనుకుంటున్నారా! అవును ఇది నిజమే ఏండ్ల తరబడి ఆ బస్టాండుకు బస్సులు పయ్య తిరగ లేదంటే ఒట్టు. నవాబ్ పేట మండల కేంద్రంలో గతంలోనే అవసరమైన స్థలంలో బస్టాండ్ నిర్మించారు. ప్రారంభోత్సవాలు చేసి అటు ఇటు కొన్ని రోజులు బస్సులను తిప్పి ఆ బస్టాండ్ ని మరిచిపోయేలా అధికారులు పట్టించుకోలేదు.
దీంతో బస్సుల రాకపోకల సైతం కేవలం ప్రధాన రోడ్లమీద గాని ఉండేవి. ప్రయాణికులు కూడా రోడ్లపైనే బస్సులను ఆపి తమ తమ ప్రయాణాలను కొనసాగించేవారు. ఈ విధానానికి ముగింపు పలుకుతూ శిథిలావస్థకు చేరిన బస్టాండును బస్సులు రాకపోకలు కొనసాగించేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో బస్టాండుకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఆలస్యమైన మంచిదే..
ఇన్నాళ్లు ఆర్టీసీ అధికారులతో పాటు సంబంధిత అధికార యంత్రాంగం బస్టాండ్ నిర్మాణం చేపట్టి ఎందుకు శిథిలావస్థకు కురిచేసిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లకు బస్టాండ్ గుర్తుకు వచ్చిందా అంటూ కొందరు ప్రయాణికులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారంటే ఎంతటి నిర్లక్ష్యానికి గురి అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆలస్యమైన అధికారులు స్పందించడం పాత బస్టాండ్ అయినప్పటికీ బస్సుల రాకపోకలు కొనసాగించేలా చర్యలు తీసుకోవడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తుండ్రు.
ఇకనైనా ఏ విభాగానికి సంబంధించినది అయినప్పటికీ అధికారులు పర్యవేక్షణ చేసిన సమయంలో సమగ్రంగా చేసి ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు చెబుతున్న మాట.






