23 April, 2026 | 2:52 AM

ఆగిన ప్రగతి చక్రం

23-04-2026 12:00 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 డిపోల్లో నిలిచిన బస్సులు

గమ్యస్థానానికి చేరేందుకు ప్రయాణికుల తిప్పలు...

సమ్మెతో ఇష్టానుసారంగా ప్రైవేటు వాహనదారుల తీరు

ఆదిలాబాద్/నిర్మల్/మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని... ఉద్యోగ భద్రత కల్పించేయడంతో పాటు కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈనెల 22 నుంచి సమ్మె చేపడుతామని ప్రభుత్వానికి గతంలోనే సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం జేఏసీ నాయకులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి కార్మికులు సమ్మెకు దిగారు.

దీంతో బస్సు చక్రలు కదలక డిపోలకే పరిమితమయ్యాయి. అర్ధరాత్రి నుండే కార్మికులు ఎక్కడి క్కడ బస్సులను నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోల పరిధిలో 1,946 మంది రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో 641 ప్రభుత్వ, అద్దె బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. సమ్మె కారణంగా ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో రోజుకు దాదాపు కోటి 78 లక్షల వరకు నష్టం జరుగుతోందని ఆర్టీసీ అధికారులు అంచన వేశారు. ఆర్టీసీ సమ్మె కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు, పరీక్ష కేంద్రాలకు వేళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమ్మెను ఆదునుగా చేసుకుని ప్రయివేట్ వాహనదారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. బస్టాండ్ ఎదుటే వాహనాలను నిలిపి ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికంగా చార్జీలు వసూళు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని కట్టడి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్య క్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆర్టీసీ అధికారులు కొంతమంది ప్రయివేట్ డ్రైవర్లతో బస్సులను పలు రూట్లలో నడిపిం చారు. అయితే బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ లేకపోవడంతో సంస్థకు ఆర్థికంగా నష్టం చేకురనుంది.

కాగా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల ఎదుట కార్మికులు ధర్నా చేశారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని జేఏసీ జిల్లా చైర్మన్ ఆశన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేయాలన్నారు.

కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించి ఉద్యోగ భద్రత, ఫిట్మెంట్. 2025 వేతన సవరణ చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల మెని ఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల కోసం పొందుపరిచిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పష్టత ఇచ్చే వరకు తమ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ లింగన్న, కన్వీనర్ ఎస్కే సజీం, పాషా, గంగయ్య, రాజు, సతీష్, సుశ్మీత, కార్మికులు పాల్గొన్నారు.

ఆర్టీసీ సంరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ టీజీ ఆర్టీసీ జేఏసీ ఆధ్వ ర్యంలో బుధవారం నిర్వహించిన మొదటి రోజు సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మె లో టీఎంయూ ఎంప్లాయిస్ యూనియన్ తదితర యూనియన్ల నాయకులు విధులకు వెళ్లకుండా డిపో కార్లేముందు నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైంసా డిపోలు ఉండగా నిర్మల్‌లో 60 బస్సులు బైంసాలో 45 బస్సులను తిప్పినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్సులు బోసిపోయి కనిపించాయి. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశం మేరకు నిర్మల్ జిల్లాలో బస్ డిపోలు బస్టాండ్ వద్ద పోలీసు భద్రత పెంచారు. విధులకు వెళ్లి ఉద్యోగులకు ఆటంకకుండా రక్షణ కల్పిస్తున్నారు. బస్ డిపోలో పీకటింగ్ నిర్వహిస్తున్నారు. ఆర్టిసి అధికారులు తాత్కాలిక పద్ధతిపై కండక్టర్ డ్రైవర్లను ఏర్పాటు చేసి ప్రధాన రూట్లో బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. అయితే బస్సులు రోడ్లపై తిరుగుతున్నప్పటికీ అందులో కండక్టర్ లేకపోవడంతో మహిళలతో పాటు పురుషులు కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం ఏర్పడగా ఇప్పుడు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం అని తెలి యడంతో చాలామంది సరదాగా బస్సులపైకి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో బస్సుల రాకపోకలు బుధవారం నిలిచిపోయాయి. కేవలం అద్దె బస్సులు మాత్రమే నడవగా సమ్మె కారణంగా చాలా మార్గాల్లో బస్సు లు డిపోకే పరిమితమయ్యాయి. సమ్మె నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచే సుకోకుండా ఉండేందుకు ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కార్మికుల డిమాండ్లు అంగీకరించాలి-: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

టీజీ ఆర్టీసీని పరిరక్షించవలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పండుతుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నిర్మల్ డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు విఫలం కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పండుతుందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిజెపి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.