17 June, 2026 | 3:01 PM

​మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'

17-06-2026 01:32 PM

అద్దాల మేడల్లో కాదు, తరగతి గదుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు: సీఎం రేవంత్ రెడ్డి

​రంగారెడ్డి, జూన్ 17(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అద్దాల మేడలు, రంగుల గోడల్లో లేదని.. అది ప్రభుత్వ పాఠశాలల(Government schools) తరగతి గదుల్లోనే నిర్మితమవుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘంటాపథంగా చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విధ్వంసమైన విద్యావ్యవస్థను తిరిగి వికాసం వైపు నడిపించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో నూతనంగా ప్రారంభించిన "తెలంగాణ పబ్లిక్ స్కూల్" ను రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ​ఆరుట్లలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ, విద్యా రంగంలో తాము తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

​ప్రభుత్వ బడికి 'నో అడ్మిషన్' బోర్డు.. సరికొత్త రికార్డు!

​సాధారణంగా కార్పొరేట్ స్కూళ్లలో కనిపించే 'నో అడ్మిషన్' బోర్డు, నేడు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో దర్శనమివ్వడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.​ఈ పాఠశాలలో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారని ఆయన వెల్లడించారు.​ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో నమ్మకం పెంచిన అక్కడి ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.​ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో ఒక "తెలంగాణ పబ్లిక్ స్కూల్" ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సీఎం ప్రకటించారు. విద్యా కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామన్నారు.

ప్రభుత్వ బడి చదువులే.. నన్ను సీఎంను చేశాయి

​"ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు ఎందరో గొప్ప నాయకులుగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగారు. దేశ గమనాన్ని మార్చిన మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గారు ప్రభుత్వ బడిలోనే చదివారు. నేనూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాడినే.. ఇక్కడి నుంచి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరాను" అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. విద్యార్థులంతా బాగా చదువుకుని, ఐఏఎస్, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదిగి తమ తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

విద్యార్థుల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు:

విద్యార్థులకు కేవలం చదువే కాకుండా, నాణ్యమైన యూనిఫామ్స్, విద్యా కిట్లను అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్" ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.​డిసెంబర్ 9న 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' ప్రారంభం​యువతకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను (స్కిల్స్ ) అందించేందుకు "యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ" ని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ​దీనికి సంబంధించిన అత్యాధునిక భవనాన్ని ఈ ఏడాది డిసెంబరు 9న ఘనంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

​క్రీడల్లో అద్భుతాలు.. మెస్సీ రాకపై విమర్శలకు కౌంటర్

​భవిష్యత్తులో ఒలింపిక్స్ లో తెలంగాణ విద్యార్థులు పతకాలు సాధించడమే లక్ష్యంగా "యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ" ని ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు.​విద్యార్థులకు ప్రపంచస్థాయి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తీసుకువచ్చి విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడించామన్నారు.

​"మేం క్రీడలను ప్రోత్సహించేందుకు మెస్సీని తీసుకువస్తే ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయ విమర్శలు చేశాయి. కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేసే వాళ్లకు భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా మిగలదు" అని సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

​తెలంగాణ దేశానికే రోల్ మోడల్..

​ప్రభుత్వ విద్యా విధానాన్ని విమర్శించే వారికి ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక సమాధానమని సీఎం అన్నారు. "ప్రజలారా.. మీరు మాకు అండగా నిలబడండి, అద్భుతాలను సృష్టిస్తాం. విద్యా, వైద్య, క్రీడా రంగాల్లో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ (ఆదర్శం) గా తీర్చిదిద్దుతాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆరుట్ల గ్రామం తెలంగాణ మొత్తానికి ఒక దిక్సూచిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.