రేవంత్ పాలనలో రోడ్డెక్కిన అన్నదాత: ఎమ్మెల్సీ దేశపతి
నంగునూరులో బీఆర్ఎస్ ధర్నా
రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్
తహసిల్దార్ కు వినతిపత్రం
నంగునూరు,(విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్ల నేడు అన్నదాతలు సాగును వదిలి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు లింగం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసనలో సామాజిక విశ్లేషకులు పాపారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్ల పాలనలో పదకొండు విడతల్లో రూ.72 వేల కోట్ల రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో వేసి పండగలా వ్యవసాయం చేయించారని కొనియాడారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెబుతూ రైతు భరోసాను ఎగ్గొడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం వల్ల పచ్చని పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని, నాణ్యమైన విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. అనంతరం రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగుల సారయ్య, వేముల వెంకట్ రెడ్డి, దువ్వల మల్లయ్య, ఎడ్ల సోమిరెడ్డి, రమేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




