7 August, 2026 | 10:05 PM

"శిశురక్ష"ణకు తల్లిపాలు అత్యధిక బలం

07-08-2026 08:58 PM

* పిల్లల వైద్య నిపుణులు హర్ష, మహేష్ రెడ్డి

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ఆస్పత్రి ప్రముఖ వైద్యులు ఎరవెల్లి చంద్రశేఖర రావు-అనురాధ దంపతుల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హర్ష, డాక్టర్ మహేష్ రెడ్డి హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బాలింతలకు అవగాహన కల్పించారు.

​బిడ్డ జన్మించిన వెంటనే ఇచ్చే ముర్రుపాలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అమృతంలా పనిచేస్తాయని తెలిపారు. ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని,అపోహలను పక్కనబెట్టి ప్రతి మాతృమూర్తి తమ బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గర్భిణులు,బాలింతలు పౌష్టికాహారం పప్పు దినుసులు,డ్రై ఫ్రూట్స్, గుడ్డు,చేపలు తీసుకోవాలన్నారు.తల్లికి ఎలాంటి వ్యాధులు ఉన్నా తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి నిచ్చే పాలు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు.

తల్లికి జలుబు, తుమ్ములు,దగ్గు వచ్చినప్పుడు పాలు పట్టే సమయంలో "శిశురక్షణ" కోసం మాస్కు పెట్టుకోవాలని  సూచించారు. బొడ్డు చుట్టు చురకలు పెట్టవద్దని, మూఢనమ్మకాలు పక్కన పెట్టాలని హితవు పలికారు. బయటి వ్యక్తుల చెప్పుడు మాటలు నమ్మవద్దని వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రవళిక, శ్రీకాంత్ స్రవంతి, ఆస్పత్రి సిబ్బంది బిక్షపతి, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.