ఈ-నామ్ 2.0కు బ్రేక్
1.0 వెర్షన్‌తోనే కొనుగోళ్లు
మహబూబాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): వ్యవసాయ మార్కెట్లలో పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వ్యవహారంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన ఈ-నామ్ 2.0 వెర్షన్ అమలును తాత్కాలికంగా పక్కనపెట్టి, శుక్రవారం 1.0 వెర్షన్‌తో రైతుల నుంచి వ్యవసా య ఉత్పత్తుల కొనుగోళ్లను చేపట్టారు. దీంతో మూడు రోజుల నుంచి రాష్ర్టంలోని వివిధ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి రైతులు పడుతున్న ఇబ్బందులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎస్‌ఎఫ్‌ఏసీ సంస్థ దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు పారదర్శకంగా క్రయవిక్రయాలు, నగదు చెల్లింపుల కోసం ఎన్‌ఎఫ్‌సీఎల్ ఆధ్వర్యంలో 2016లో ఈ నామ్ 1.0 వెర్షన్ ప్రవేశపెట్టింది.
అయితే ఈ ఏడాది జనవరిలో ఈ నామ్ అమలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్‌ఎఫ్సీఎల్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోగా అకాల్ అనే కంపెనీ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. కొత్త కంపెనీ 2.0 విధానాన్ని ప్రవేశ పెట్టడానికి నిర్ణయించి కొత్తగా మా డ్యులర్‌లు రూపొందించింది. బుధవారం నుంచి వెర్షన్ 2.0 విధానాన్ని ప్రవేశపెట్టగా కొత్త మ్యాడ్యులర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటు సర్వర్ కూడా సక్రమంగా పనిచేయలేదు. దీనివల్ల రైతులు రోజుల తరబడి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడానికి మార్కెట్లలో పడిగాపులు పడా ల్సి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తి ఆందోళనలు పెరిగిపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కార్యద ర్శుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశాల మేరకు శుక్రవారం 2.0 నూతన వెర్షన్ విధానాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి, ఈ నామ్ 1.0 పాత పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు.




