సన్న వరికి రూ.500 బోనస్
సెప్టెంబర్ 10లోగా రైతుల వివరాల నమోదు
చివ్వెంల: వానాకాలం-2026లో ప్రభుత్వం గుర్తించిన 7 సన్న వరి రకాల సాగును ప్రోత్సహిస్తూ రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించనుంది. బోనస్ పొందేందుకు రైతులు సెప్టెంబర్ 10లోగా తమ వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు తెలిపారు. గుర్తింపు పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు బిల్లులతో డీలర్లను సంప్రదించి నమోదు చేయించుకోవాలి.
సొంత విత్తనాలు లేదా తోటి రైతుల నుంచి విత్తనాలు పొందిన వారు తమ పరిధిలోని ఏఈఓను సంప్రదించి వివరాలు నమోదు చేయించుకోవాలి. శుక్రవారం తిరుమలగిరి గ్రామంలోని విత్తన డీలర్ వద్ద జరుగుతున్న రైతుల నమోదు ప్రక్రియను వెంకటేశ్వర్లు పరిశీలించారు. రైతులందరూ నిర్ణీత గడువులోగా వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ను పొందాలని ఆయన కోరారు.






