కేజీబీవీని దత్తత తీసుకుంటా.. సమస్యలు పరిష్కరిస్తా
చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయులు, జీసీడీవో, పాఠశాల ఎస్‌ఓ ఘన స్వాగతం పలికారు. పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిశీలించిన పటేల్ రమేష్ రెడ్డి పాఠశాలను దత్తత తీసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. కోతుల బెడద నివారణకు గ్రిల్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రూ.14 వేల విలువైన మైక్ సెట్‌ను పాఠశాలకు విరాళంగా అందజేశారు. విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రయోజకులుగా మారి నలుగురికి, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని, స్ప్రెడ్ ఇండియా సంస్థ చైర్మన్ తన సోదరుడు పటేల్ శ్రీధర్ రెడ్డి సహకారంతో విద్యార్థినులకు ఎలాంటి వసతుల లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు.






