నేరాల పెరుగుదలను అరికట్టాలి
కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం తనిఖీ
ఇన్చార్జి డిఐజి సన్ ప్రీత్ సింగ్
కామారెడ్డి,(విజయక్రాంతి): నేరాల పెరుగుదలను అరికట్టాలని ఇన్చార్జి డిఐజి సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ, డిఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేశారు.జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాల పరిస్థితి, వివిధ నేరాల నమోదు–దర్యాప్తు, కేసుల డిటెక్షన్, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై డీఐజీ కి సమగ్ర వివరాలను అందించారు.
అనంతరం డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ, ప్రమాదం జరిగిన ప్రతి ప్రాంతాన్ని అధికారులు స్వయంగా సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యలను సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టాలని సూచించారు.
ముఖ్యంగా గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయికి బానిసైన వ్యక్తులను గుర్తించి డీ-అడిక్షన్‌కు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, గంజాయి సరఫరా, రవాణా వ్యవస్థను గుర్తించి మూలాలను ఛేదించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సైబర్ నేరాలపై ముందస్తు జాగ్రత్తలు, సాంకేతిక భద్రతా చర్యలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ అడ్మిన్ కే. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డితో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.






