బోనాల పండుగ.. ట్రాఫిక్ మళ్లింపు
ట్రాఫిక్ పోలీసుల అడ్వైజరీ జారీ
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఆగస్టు 9, 10వ తేదీల్లో బోనాల పండుగను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఉత్సవాల వేళ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు.
ఈ కింద ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ని సంప్రదించవచ్చన్నారు. తమ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా మిగతా వివరాలు తెలుసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు.
లాల్ దర్వాజ, కార్వాన్, పురానాపూల్, టప్పాచబుత్రా, గౌలిగూడ, అలియాబాద్, ఉప్పుగూడ, అంబర్‌పేట్, ఉప్పల్, రామాంతాపూర్, అంబర్‌పేట్, తిలక్ నగర్, ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ, చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ నగరంలోని తదితర ప్రముఖ అమ్మవారి ఆలయాల వైపు వచ్చే వాహనాలకు ఆగస్ట్ 8 రాత్రి నుంచి ఆగస్ట్ 10 ఉదయం వరకు ఆంక్షలు కొనసాగుతాయని వివరించారు. అన్నిచోట్లా మళ్లింపులు ఉంటాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు కొనసాగించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు.






