22 May, 2026 | 4:19 PM

ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే

22-05-2026 03:23 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): వడ్లు, మొక్కజొన్న పంటలను తక్షణం కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్  కలెక్టరేట్ ఎదుట బిజెపి నిరసన, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడం, ప్రారంభించిన మందకుడిగా కొనుగోళ్లు  సాగడంతో రైతులు వారాల తరబడి మార్కెట్ యార్డులలో పడిగా గాపులు కాస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అదునుగా భావించిన  దళారులు, కొంతమంది అధికారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన  ఆరోపించారు. ముఖ్యంగా నాణ్యమైన వడ్ల పంటను సైతం ఏ గ్రేడ్ నుండి బి గ్రేడ్ కు మార్చడం, తాలూ తరుగు పేరిట కోత విధించి రైతులను నిలువ దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకుండా , దళారులు ,ట్రేడర్లు తక్కువ ధరకే రైతు పంటను కొనుగోలు చేస్తు రైతుల పొట్టగొడుతున్నారన్నారు. అహో రాత్రులు శ్రమించి చెమటోడ్చిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు కాంగ్రెస్ పాలనలోఅష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దళారులు, ట్రేడర్లు రైతును నిలువు దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్  ప్రభుత్వం చోద్యం చూస్తుందని, రైతులను దోచుకోండని కాంగ్రెస్ ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు ఉందని, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అదే విషయాన్ని  స్పష్టం చేస్తుందన్నారు. అసలు కాంగ్రెస్ సర్కార్కు రైతులపై ఇంత కక్ష సాధింపు ఎందుకు . ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఐకెపి సెంటర్లలో , యార్డులలో ఉన్న వడ్లు , మొక్కజొన్న  ప్రతి చివరి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ సర్కార్ కొనుగోలు కేంద్రాల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, ప్రధానంగా కొనుగోలు కేంద్రాలలో కూలీల కొరత, సంచుల కొరత, రవాణా వ్యవస్థ సక్రమంగా లేవని ఆయన విమర్శించారు.

దీంతోనే రైతులు పంట కొనుగోళ్ల కోసం రోజుల తరబడి  కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే దయనీయ పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని ఇప్పటికే ఆర్థికంగా దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, కావాలనే ఈ కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందనీ,. దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  కొనుగోళ్లు ఆలస్యమైతే, వర్షాలకు తడిసిపోతాయనే భయంతో రైతులు తమ పంటను మద్దతు ధర కంటే తక్కువకే మిల్లర్లకు అమ్ముకుంటారనీ, తద్వారా రైతులకు ఇస్తామన్న రూ. 500 అదనపు బోనస్‌ను ఎగ్గొట్టవచ్చని ప్రభుత్వం కుతంత్రం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం  రైతు కంట కన్నీరు పెట్టిస్తుందన్నారు.

రైతులు ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితుల్లో లేరని  , రైతుల ప్రయోజనాలను కాపాడటానికి భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో అలుపెరగని పోరాటం చేస్తుందని ,అన్నదాతకు న్యాయం జరిగే, వడ్లు, మొక్కజొన్న చివరి గింజ కొనే వరకు  బీజేపీ విశ్రమించదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం వడ్ల లో  బి కేటగిరి దోపిడీని అరికట్టాలని, సంచులు, రవాణాలో అదనపు చార్జీలు రద్దు చేయాలని ,  రవాణా కోసం తగిన లారీలు ఏర్పాటు చేయాలని, తాలు, తరుగు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.