22 May, 2026 | 4:08 PM

భాగ్యరెడ్డి వర్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తి

22-05-2026 03:17 PM

అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సామాజిక సంస్కర్త, దళిత బహుజన ఉద్యమకారుడు భాగ్యరెడ్డి వర్మ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ లో నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకల్లోఅదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, జిల్లా రెవెన్యూ అధికారి వేణు, ఆర్డిఓ లోకేశ్వరరావులతో కలసి ఆయన పాల్గొన్నారు. భాగ్యరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు.

ఆది హిందూ ఉద్యమాన్ని స్థాపించి సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడారని పేర్కొన్నారు. మహిళల విద్య, సామాజిక చైతన్యం, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.సమాజంలో విద్యా వ్యాప్తి కోసం పాఠశాలలను స్థాపించడం, సామాజిక సంస్కరణల కోసం ఉద్యమాలు చేపట్టడం ద్వారా భాగ్యరెడ్డి వర్మ విశిష్ట గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.