2 April, 2026 | 4:46 PM

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది

02-04-2026 02:53 PM

ఏపీ రాజధాని కోసం 29 వేల మంది.. 33 వేల ఎకరాలిచ్చారు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం వికసిత్ రాజధాని అవసరం

విభజన సమస్యల పాపం కాంగ్రెస్ దే

న్యూఢిల్లీ: రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై(Amaravati Capital Bill) చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్(BJP MP Laxman) మాట్లాడుతూ... ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. భవ్య రాజధాని సాకారం కోసం ఏపీ ప్రజలు కలలు కన్నారని సూచించారు. వికసిత్ భారత్ సాకారం కోసం వికసిత్ ఆంధ్ర నిర్మాణం ఆవశ్యకం అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం వికసిత్ రాజధాని అవసరమని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం సుదీర్ఘంగా పోరాడిన మహిళలకు, ఘన చరిత్ర ఉన్న తెలుగుజాతికి లక్ష్మణ్ శిరస్సు వంచి నమస్కరించారు. అమరావతి బిల్లు ఆమోదం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని వెల్లడించారు.

తెలుగువారి కోసం ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు పోరాడారని గుర్తుచేశారు. వైసీపీ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించింది. రాష్ట్రాలకు రాజధాని గురించి చట్టంలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే పేరు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. పార్లమెంట్ నుంచి మట్టి, పవిత్ర గంగాజలాన్ని ప్రధాని మోదీ అమరావతికి తీసుకొచ్చారని ఆయన గుర్తుచేశారు. అండగా ఉంటామని భరోసా ఇస్తూ అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేశారని తెలిపారు. పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలతో మూడు ముక్కలాట ఆడిందని లక్ష్మణ్ మండిపడ్డారు.  పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలతో ప్రపంచం నివ్వెరపోయిందన్నారు. పిల్ల కాంగ్రెస్ , తల్లి కాంగ్రెస్ ను ప్రజలు మట్టికరించారని తెలిపారు. 

తెలుగు ప్రజలను అవమానించినందుకు.. ఎన్టీఆర్ పార్టీ పెట్టారు: కె. లక్ష్మణ్

తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలను అవమానించినందుకు ప్రాంతీయ పార్టీ పెట్టారని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్.. పార్టీ ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ విధానాల పట్ల ఎన్టీఆర్ నిరంతర పోరాటం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ యేతర పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారని, కేంద్ర పెత్తనం చెల్లదని జాతీయస్థాయిలో రాజకీయాలు చేశారని వెల్లడించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు, బడుగులకు అధికారమిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. హైదరాబాద్ ను సైబరాబాద్ చేసింది చంద్రబాబు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. విభజన సమస్యల పాపం కాంగ్రెస్ దే అని ఆరోపించారు.