25 June, 2026 | 12:21 PM

12 ఏళ్ల బాలికకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదు

25-06-2026 11:27 AM

ఎన్ హెచ్ ఆర్ సి వారికీ కూడా రికార్డ్ ఇవ్వలేని స్థితిలో నిమ్స్

బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు

ఖమ్మం టౌన్  (విజయ క్రాంతి): ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యంత దారుణమైన లైంగిక దాడి ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు, బాధిత బాలికపై దాడి అనంతరం ఆమెను భవనం పై నుంచి కిందకు తోసివేయడం అమానుష చర్య అని, న్యాయం జరిగే వరకు బీ జె పి పోరాటం ఆపదని బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు బుధవారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు  అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రెండు కాళ్లు పనిచేయని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న ఎన్ హెచ్ ఆర్ సి చైర్‌పర్సన్  విజయభారతి నిమ్స్ ఆసుపత్రిలో బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వైద్య రికార్డుల విషయంలో ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కమిషన్ కోరిన వైద్య పత్రాలను అందించడంలో జాప్యం చేయడం, పలు వివరాలను గోప్యంగా ఉంచే ప్రయత్నాలు జరగడం విచారణకు గురికావాల్సిన అంశాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలని, సంఘటన జరిగిన తర్వాత తొలి రోజులలో జరిగిన వైద్య చికిత్సలు, కేసు పురోగతి, అధికారుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఖమ్మం బస్టాండ్‌లో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్ తాళ్లూరి అంజయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పమ్మి అనిత, జిల్లా కార్యదర్శి రజినీ రెడ్డి , మహిళా మోర్చా అధ్యక్షురాలు మందా సరస్వతి , ఖమ్మం జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్ మార్తినేని వీరభద్ర ప్రసాద్ , రామినేని మణి తదితరులు పాల్గొన్నారు.