20-02-2026 05:28:48 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బిక్కనూరు మండల కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేపై ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉందని, వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గ అభివృద్ధిని పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమన్నారు. వరదల సమయంలో ప్రజల బాధలను అవహేళన చేసిన చరిత్ర ఉన్న వ్యక్తి నేడు నీతులు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. 150 కోట్ల అభివృద్ధి హామీలకు లెక్క చెప్పాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని నిలదీశారు.
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ... రెండేళ్ల పాలనలో ఎమ్మెల్యే ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోలేని స్థితిలో ఉండి ధర్మం, దేశం అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం దొంగనాటకమన్నారు. ఇంటిగ్రేటెడ్ కాలేజ్ తరలిపోవడానికి ఎమ్మెల్యే వైఫల్యమే కారణమని, మహిళా ప్రతినిధుల పట్ల అనుచిత ప్రవర్తన ఆయన సంస్కారాన్ని వెల్లడిస్తోందన్నారు.
ఈ సమావేశంలో పలువురు సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుబట్టారు. షబ్బీర్ అలీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే మండలవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలని, వ్యక్తిగత విమర్శల రాజకీయానికి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఎదురుదాడి చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.