హనుమాన్ జయంతి సందర్భంగా భీమేశ్వర
ఆలయంలో భక్తులకు ప్రత్యేక వేసవి సౌకర్యాలు
వేములవాడ, మే 11(విజయక్రాంతి )శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారీ ఫ్యాన్లు, క్యూలైన్లలో జంబో కూలర్లు, అదనపు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులకు నీడ కల్పించేందుకు చలువ పందిళ్లు, చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు.
శ్రీ రాజరాజేశ్వర జల ప్రసాదం ఆధ్వర్యంలో చల్లని తాగునీటి పంపిణీ, కూల్ బబుల్స్ ద్వారా నిరంతరం భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు. మహా మండపంలో ఎయిర్ కండిషనర్లు (ACలు), ఫ్యాన్లు ఏర్పాటు చేయగా, మూల విరాట్టు దర్శన మార్గాల్లో జంబో కూలర్లు ఏర్పాటు చేసి భక్తులకు చల్లని వాతావరణం కల్పిస్తున్నారు. అదేవిధంగా భక్తులకు ప్రసాదాల పంపిణీ, దర్శన ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.






