20 May, 2026 | 1:34 AM

భైంసా కో ఆప్షన్ ఎన్నిక ఏకగ్రీవం

20-05-2026 12:27 AM

బైంసా, మే 19 (విజయక్రాంతి) : భైంసాలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎట్టకేలకు బుధవారం ప్రశాంతంగా ముగిసింది. గత నెలలో గందరగోళం నడుమ ఇద్దరు సభ్యుల ఎన్నిక జరుగగా, ఒకరి ఎన్నికను ధృవీకరిస్తూ ధ్రువపత్రం సైతం అందించారు. మరో సభ్యుడి ఎన్నిక కూడా ధృవీకరించాలని ప్రతిపక్ష ఎంఐఎం డిమాండ్ చేసింది. మొదటి సమావేశంలో జరిగిన ఎన్నికను వాకౌట్ చేసిన పాలక పక్ష సభ్యులు మరోమారు ఈ నెల 12 న ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు.

అయితే, ఎన్నిక వాయిదా వేస్తూ కమిషనర్ ఒకరోజు రాత్రి ఫోన్ సందేశ రూపంలో చెప్పడంతో, దీన్ని నిరసిస్తూ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ కార్యాలయం వద్ద మూడు రోజుల పాటు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమించిన పాలక పక్ష సభ్యులు ఈ నెల 19 న ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు.

ఎట్టకేలకు సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ఎన్నికకు బుధవారం సమావేశం నిర్వహించారు. పాలక పక్ష సభ్యులు 13, ఎక్స్ అఫిసియో ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిపి 14 మంది సభ్యులకు మెజారిటీ చేరింది. ఇందులో ముజీబ్ అహ్మద్(మైనారిటీ), అల్లకొండ కవిత(జనరల్ మహిళ), తోట లింగురాం (జనరల్ పురుషులు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కోర్టు తీర్పుకు లోబడి..

బైంసా మున్సిపల్ కౌన్సిల్లో మంగళవారం నిర్వహించిన ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు న్యాయస్థానం తీర్పుకు లోబడి ఉంటుందని ఎన్నికల ప్రత్యేక అధికారి బైంసా సబ్ కలెక్టర్ తెలిపారు.