సినీనటి నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రముఖ తెలుగు సినీనటి నిధి అగర్వాల్ హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో అధికారులు ఆమెను ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి హవాలా మార్గాల్లో ఆమె నగదు లావాదేవీలు జరిపారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
ఈ యాప్‌లో ప్రమోషన్ ద్వారా ఆమె అందుకున్న పారితోషికం, కమీషన్ల వివరాలపై అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ బెట్టింగ్ పాట్‌ఫారమ్‌లు నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించాయనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి దాదాపు 29 మంది ప్రముఖులు, సినీనటులు, సోషల్ మీడి యా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగానే నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాశ్‌రాజ్, విజయ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.






