రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి/ చిట్యాల,ఆగస్టు 21(విజయక్రాంతి): అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) వైద్యులను ఆదేశించారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ప్రసూతి విభాగం, ఐసీయూ, రక్త పరీక్షల ప్రయోగశాలను పరిశీలించి, రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యం, మందులు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని, రోగుల నమూనాలను టీ-హబ్‌కు పంపించి పరీక్షల నివేదికలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని, వార్డుల్లో ర్యాక్‌లు, వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అల్ట్రాసౌండ్ యంత్రం సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పాము, తేలు కాట్లకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తనిఖీలో డా. శ్రీకాంత్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ వసంత రావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.






