21 July, 2026 | 9:49 AM

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ కె. హైమావతి

20-07-2026 09:01 PM

సిద్దిపేట కలెక్టరేట్: దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఏఎన్‌ఎంలు ఎన్‌సీడీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారా, సీజనల్ వ్యాధుల నివారణకు శానిటేషన్ డ్రైవ్ సక్రమంగా చేపడుతున్నారా అని ఆరా తీశారు. రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన ఓ బాలికతో జిల్లా కలెక్టర్ మాట్లాడగా, ఐదు రోజులుగా జ్వరం వస్తోందని, తాను చింతమడక మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్నట్లు తెలిపింది. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, అధైర్యపడవద్దని కలెక్టర్ సూచించారు.గురుకుల పాఠశాలలో బాలికలకు జ్వరం వస్తున్నట్లు తెలియడంతో వెంటనే ఫీవర్ సర్వే నిర్వహించాలని డీఎంహెచ్‌ఓను జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు.