బాసర ఐఐఐటీలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం
భైంసా జూలై 15 (విజయక్రాంతి): బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటి) విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. బుధవారం ఆయన వర్సిటీని సందర్శించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాంపస్లో విద్యార్థులకు నిరంతర విద్యుత్, సురక్షిత త్రాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పించడంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఏ విద్యార్థీ చదువు మధ్యలో ఆపేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, చదువు పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ, విద్యాబోధన తీరుపై ఆయన ఆరా తీశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యా ప్రమాణాలను పెంచేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్సిటీ అభివృద్ధి, వసతుల గురించి చైర్మన్కు వివరించారు.అనంతరం చైర్మన్ ను, కమిషన్ సభ్యులను అధికారులు సన్మానించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కుస్త్రం నీలాదేవి, వైస్ చాన్సలర్ గోవర్ధన్, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ వెంకట రామయ్య, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ అజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






