06-02-2026 01:57:12 AM
ఘటనపై కలెక్టర్ హరిత తీవ్ర అసహనం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో గల వివిధ శాఖల కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్ కె. హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో ఫీల్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి తన స్థానంలో ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించి విధులు చేయిస్తున్న విషయం కలెక్టర్ సాక్షిగా బయటపడింది. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.మరో కార్యాలయం వద్ద పట్టపగలు విద్యుత్ దీపాలు వెలుగుతుండటాన్ని గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. లైట్లు స్విచ్ ఆఫ్ చేయడానికి సమయం లేకపోతే తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే తానే వచ్చి ఆఫ్ చేస్తానని వ్యాఖ్యానించారు.
కలెక్టర్ ప్రతిరోజు ఏదో ఒక చోట ఆస్మిక తనిఖీ నిర్వహించడంతో ప్రభుత్వ వర్గాల్లో అలజడి మొదలైంది. విధుల పట్ల నిర్లక్ష్యం వాయి స్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత పాల్గొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఆలోక్ కుమార్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, శిక్షణ ఐఏఎస్ అధికారి భార్గవ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతాయని, పోలింగ్లో వినియోగించే ప్రతి పత్రంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పీఓ డైరీలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలని, ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని జోనల్ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పత్రాలను ముందుగానే సరిచూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతంగా విధులు నిర్వహిస్తూ సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.