బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలి
జిల్లా కోర్టు వద్ద నిరసన
నల్లగొండ టౌన్, ఆగస్టు 21 :బార్ కౌన్సి ల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అనుసరిస్తున్న ఏకపక్ష, అప్రజాస్వామిక, రాజకీయ పక్షపాత వైఖరి పట్ల ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (అయిలు ) నల్లగొండ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కోర్టు ముందు అయిలు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడు తూ మనన్ కుమార్ మిశ్రా 14 ఏళ్ళ కు పైగా బీసీఐ చైర్మన్గా కొనసాగుతూ అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం దారుణమన్నారు.
బీసీఐ ఏ రాజకీయ పార్టీకి అనుబం ధ సంస్థ కాదని, దేశంలోని న్యాయవాదులందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన స్వతంత్ర సంస్థ అని అన్నారు. బీసీఐ అధికారిక లెటర్హెడ్ను రాజకీయ ప్రకటనలకు వాడటం సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని విమర్శించారు.నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ పట్టభద్రులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు.
కొంతమంది విద్యార్థులు శాంతి యుతంగా అభిప్రాయం వ్యక్తం చేసినందుకు మొత్తం బ్యాచ్ను శిక్షించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. క్షమాపణ చెప్పినా బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు.ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్ల స్వ తంత్రతలో జోక్యం, ఎన్నికల్లో ఓడిపోయిన వారిని నామినేషన్ల ద్వారా నియమించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. న్యాయ కళాశాలల తనిఖీలు, అనుమతులు, విరాళాల సేకరణపై వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎల్ యూ జిల్లా ఉపాధ్యక్షులు పందెనపల్లి బ్రహ్మచారి, జిల్లా నాయ కులు డి. నర్సాజీ, భీమగాని గణేష్, ఎన్. రాములు, పి. శేఖర్, దుర్గాప్రసాద్, మురళీకృష్ణ, నాగరాజు, స్వామినాథ్, సతీష్, నితీష్, రతన్ తదితరులు పాల్గొన్నారు.






