14 April, 2026 | 2:04 AM

పోర్టులపై పోరు

14-04-2026 12:19 AM
  1. ‘హోర్ముజ్’ వద్ద అమెరికా నావల్ బ్లాకేడ్
  2. ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా వచ్చే నౌకలకు నోఎంట్రీ
  3. ఏ దేశమూ ఇరాన్ పోర్టులను వినియోగించొద్దు: ట్రంప్
  4. పర్షియన్ తీరంలో ఏ పోర్టూ మిగలదు: ఇరాన్
  5. భద్రత ఉంటే అందరికీ ఉండాలి.. లేదంటే ఎవరికీ వద్దని స్పష్టీకరణ

టెహ్రాన్/ వాషింగ్టన్, ఏప్రిల్ 13: ఇరాన్‌తో శాంతిచర్చలు విఫలమైతే హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుగా ప్రకటించినట్లుగానే, అమెరికన్ నావికా దళానికి ‘నావల్ బ్లాకేడ్’ అమలుకు ఆదేశాలిచ్చారు. దీంతో  సోమవారం రాత్రి 7:౩౦ గంటల (భారత కాలమానం ప్రకారం) నుంచి దిగ్బంధం మొదలైంది.

ఇరాన్ పోర్టులకు వెళ్లే నౌకలు లేదా అక్కడి పోర్టుల నుంచి వచ్చే నౌకలకు ఎట్టిపరిస్థితుల్లో జలసంధి దాటేందుకు అనుమతి ఉండబోదని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, జలసంధి వద్ద నావల్ బ్లాకేడ్ అమలుపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తమ పోర్టులను లక్ష్యంగా చేసుకుంటే, పర్షియన్ గల్ఫ్ తీరంలోని ఏ ఒక్క పోర్టునూ వదిలిపెట్టమని హెచ్చరించింది. ‘పర్షియన్ గల్ఫ్ భద్రత అనేది ఉంటే అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండ కూడదు’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

జలసంధి ఇప్పటికీ తమ పూర్తి నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. అమెరికా దళాలు ఏదైనా తప్పటడుగు వేస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, తాము కూడా దాడులకు దీటుగా సమాధానమిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఏదేమైనా, రోజుకు లక్షలాది బ్యారెళ్ల చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికే అమెరికా ఈ దిగ్బంధన అస్త్రాన్ని ప్రయోగించిందని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా ఉద్రిక్తల కారణంగా భారత్‌కు చెందిన ౧౫ నౌకలు జలసంధిలోనే చిక్కుకుపోయాయి.

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించే ఓడల సంఖ్య భారీగా పడిపోయింది. సాధారణ రోజుల్లో రోజుకు 125 నౌకలు జలసంధి గుండా ప్రయాణించగా, ఇప్పుడా సంఖ్య 30కి పడిపోయింది. అలాగే, కాల్పుల విరమణ ఒప్పందంతో 100 డాలర్లకు దిగివచ్చిన బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర మళ్లీ 103 డాలర్లకు చేరింది. జలసంధి దిగ్బంధం కొనసాగితే 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ పోర్టులు వినియోగించొద్దు: ట్రంప్

ఇరాన్‌కు అక్రమంగా ట్రాన్సిట్ టోల్ (రవాణా రుసుము) చెల్లించి వెళ్లే ఏ నౌకకూ మినహాయింపు ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ఏ దేశమూ చమురు, ఎల్పీజీ రవాణాకు ఇరాన్ పోర్టులను వినియోగించకూడదని కూడా హుకం జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించే నౌకలను అమెరికన్ దళాలు స్వాధీనం చేసుకుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళానికి చెందిన 158 నౌకలను తమ దళాలు తుడిచిపెట్టాయని వెల్లడించారు. ఇక ఇరాన్ వద్ద మిగిలిన ఫాస్ట్ అటాక్ షిప్స్‌కూ అదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు.

భారత్ నుంచి టోల్ వసూలు చేయలేదు: ఇరాన్ రాయబారి ఫతాలీ

హోర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు వెళ్లే ఏ ఒక్క నౌకకూ ఇరాన్ ట్రాన్సిట్ టోల్ (రవాణా రుసుము) వసూలు చేయలేదని భారత్‌లోని ఇరాన్ రాయబారి ఫతాలీ స్పష్టం చేశారు. ఏమైనా సందేహముంటే, వారు భారత ప్రభుత్వాన్నే అడిగి తెలుసుకోవచ్చని హితవు పలికారు.