14 April, 2026 | 2:09 AM

ఓటు హక్కుపై ఎన్నికల ఒత్తిడి ఉండకూడదు

14-04-2026 12:16 AM

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో కొనసాగడం పౌరుల నిరంతర హక్కు అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం ఎన్నికలు జరుగుతున్నాయనే కారణంతో ఓటర్ల హక్కులకు భంగం కలగకూడదని పేర్కొంది. ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాదని, అది ఒక భావోద్వేగమని కోర్టు అభిప్రాయపడింది.

ముఖ్య న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ కొందరు ఓటర్లు కోర్టును ఆశ్రయించారు. జాబితాలో పేర్ల నమోదుకు గడువును పెంచాలని కోరారు. ఎన్నికల సంఘం ఏప్రిల్ 9వ తేదీతో ఓటర్ల జాబితాను ఖరారు చేసింది. అప్పీళ్ల విచారణలో విజయం సాధిస్తే తమకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.

పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నాయని ధర్మాసనం గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా బెంగాల్లో కొత్త నిబంధనలు పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పాత జాబితాలో ఉన్నవారు కొత్తగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని గతంలో ఎన్నికల సంఘం చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ ప్రక్రియలో పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్టమైన వ్యవస్థ ఉండాలని న్యాయమూర్తులు సూచించారు.

వేల సంఖ్యలో పత్రాలను పరిశీలించేటప్పుడు తప్పులు దొర్లడం సహజమని కోర్టు పేర్కొంది. బాధితుల ఫిర్యాదులను వినడానికి బలమైన యంత్రాంగం అవసరమని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ లోపు ఓటర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.