బతుకమ్మకుంట ముమ్మాటికీ చెరువే
- కోర్టు తీర్పు మేరకు గేట్లు, బోర్డులను తొలగించాం
- చారిత్రక ఆధారాలు చూపించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
సికింద్రాబాద్, మే 2 (విజయక్రాంతి): అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట ముమ్మాటికీ చెరువే అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. బతుకమ్మ కుంట చెరువును పునరుద్ధరించడంపై ఎడ్ల సుధాకర్‌రెడ్డి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై హైడ్రా కమిషనర్ రంగానాథ్ శనివారం హైడ్రా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మకుంటలో అసలు చెరువు లేదని ఎడ్ల సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని, సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అక్కడ పదెకరాల చెరువు ఉన్నట్టు స్పష్టమైందని చెపుతూ శాటిలైట్, గూగుల్ మ్యాప్స్‌తో చారిత్రక ఆధారాలను చూపించారు. 1975లో ఇరిగేషన్ రికార్డుల్లో కుం టగా పేర్కొన్న ఆధారాలను చూపించారు.
సర్వే నంబరు 563/1 లో 9.19 ఎకరాల వరకూ చెరువున్నట్టు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ రికార్డులుతో సహా వెల్లడించాయన్నారు. ఆ చెరువుకు కట్ట 563/2 సర్వే నంబ రులో 6 గుంటల మేర మాసాన్ కట్ట పేరిట ఉందన్నారు. గ్రామ రికార్డులతో పాటు, 1971లో సర్వే ఆఫ్ ఇండియా ఫొటోలు, 1989లో నాసా (ల్యాండ్శాట్) రూపొందించిన శాటిలైట్ పిక్షర్స్ను మీడియాకు విడుదల చేశారు. సుధాకర్‌రెడ్డి పిటిషన్‌పై వివరణతో 3 వారాల్లో అఫడవిట్‌ను దాఖలు చేయాలని సోమవారం సుప్రీంకోర్టు సూచిం చిందని తెలిపారు.
బండ్లగూడ మండలం, విలేజ్లోని సల్కం చెరువు విషయంలో కూడా కోర్టు హైడ్రాను తప్పు పట్టలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలు హైడ్రా కోరిన విషయాన్ని కూడా హైకోర్టు తీర్పులో పేర్కొందని.. ఇరిగేషన్, రెవెన్యూ నుంచి వచ్చిన నివేదిక మేరకు చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. చెరువులన్నీ ప్రజల సొత్తని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వరదల నివారణకు చర్యలు తీసుకునేందుకు హై కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని, హైకోర్టు డివిజన్ ఉత్తర్వులను పాటిస్తున్నామని రంగనా థ్ అన్నారు. చెరువు భూమికి తానే యజమానినని, అక్కడ వ్యవసాయం చేసినట్లు ఎడ్ల సుధాకర్ రెడ్డి చెబుతున్నారు.
అసలు చెరువులోఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయి? చెరువుని పూడ్చి కూడా వ్యవసాయం చేయొచ్చు. అలా చేసినంత మాత్రాన చెరువుకు యజమాని అయిపోరు కదా అని అన్నారు. చెరువు ప్రాంతంలో నిరుపేదల ఇళ్లు ఉంటే.. అక్కడి నుంచి ఖాళీ చేయించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, ప్రభుత్వం కూడా ఇం దుకు సానుకూలంగా ఉందని రంగనాథ్ తెలిపారు. చెరువుల వద్ద నిర్మాణాలు చేపడతామంటే కుదరదన్నారు.
మొదటి విడతగా ఆరు చెరువులను పునరుద్ధరిస్తున్నామని. ఇందులో ఇప్పటికే మూడింటిని ప్రారంభించామన్నారు. రెండో విడతగా 14 చెరువుల పునరుద్ధరణను చేపడుతున్నామని.. మరో 4 పెద్ద చెరువులను కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. హైడ్రా ఇప్పటి వరకూ 2093 ఎకరాలను స్వాధీనం చేసుకుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమి విలువ దాదాపు రూ. 80 వేల కోట్లుగావరకూ ఉంటుందని తెలిపారు. వివిధ సందర్భాల్లో ఇప్పటివరకూ 90కి పైగా కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇటీవల ముష్కిన్ చెరువులో తాత్కాలిక షెడ్డులు వేసుకున్న వారితో మాట్లాడి 10 రోజులు గడువు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఐలాపూర్లో పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదని చెప్పారు.






