12 August, 2026 | 12:59 AM

భవనాలు ఉన్నా.. చిత్తశుద్ధి సున్నా

12-08-2026 12:00 AM

అద్దె గదుల్లో గర్ల్స్ హాస్టల్ విద్యార్థినుల నరకయాతన 

నిరుపయోగంగా ‘వృత్తి విద్యా కేంద్రం’

చేవెళ్ల, ఆగస్టు 11(విజయక్రాంతి): ఒకవైపు బహుళ జాతి కంపెనీలకు వందలాది ఎకరాల భూములను కట్టబెడుతున్న ప్రభుత్వాలు... మరోవైపు చదువుకోవడానికి ఇల్లు వదిలి వచ్చిన పేదింటి ఆడపిల్లలకు ఒక సొంత వసతి గృహాన్ని కేటాయించలేకపోతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో గాయకుడు మల్లావాఝల సదాశివుడు ‘తల్లాపున పారుతుంది గోదారి... నీ సేను నీ సెలక ఎడారి‘ అని పాలకుల వివక్షను ప్రశ్నించినట్లే, నేడు చేవెళ్లలో ఉన్నత చదువుల కోసం వచ్చిన 130 మంది విద్యార్థినులు వసతులు లేక అల్లాడిపోతున్నారు. అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి లేమి కారణంగా ఇక్కడి పేద విద్యార్థినుల విద్యార్థి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

అద్దె భవనాల్లో అవస్థలు... 

కొత్త భవనానికి సుముఖత ఏదీ?

వికారాబాద్, పరిగి, తాండూరు తదితర ప్రాంతాల నుండి వచ్చి ఇంటర్, డిగ్రీ చదువుతున్న 130 మంది విద్యార్థినుల కోసం 2018లో చేవెళ్లలో ప్రారంభించిన గరల్స్ హాస్టల్ నేటికీ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. పరిమితికి మించిన సంఖ్యతో సకల సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో క్లబ్ అయి తలదాచుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ తీవ్రమైన సమస్యపై విద్యార్థి సంఘ నాయకులు తాజా, మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, పక్కా భవన నిర్మాణంపై పాలకులకు సుముఖత కనిపించడం లేదు. సరైన వసతులు లేక కొందరు విద్యార్థినులు చదువు మధ్యలోనే మానేసే పరిస్థితి దాపురించింది.

ఏండ్ల తరబడి మూలన పడ్డ ‘వృత్తి

విద్యా శిక్షణ కేంద్రం’

చేవెళ్ల జూనియర్ కళాశాల ప్రాంగణంలో మండల వృత్తి విద్యా కోర్సుల కోసం అప్ప టి ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించింది. 1995లో ఈ భవనాన్ని మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ (ఎంవీఎఫ్) వినియో గించుకుని స్థానిక పేద విద్యార్థులకు విద్యనందించింది. ఆ విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కానీ, ఆ తర్వాతి నుంచి ఈ భవనం నిరుపయోగంగా మారడమే కా కుండా, పట్టించుకునే నాథుడు లేక శిథిలావస్థకు చేరుకుంటోంది.

కలెక్టర్ సార్ కరుణించండి..

శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టం గా కనిపిస్తోంది. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న వృత్తి విద్యా భవనానికి మరమ్మతులు చేపట్టి, గర్లస్ హాస్టల్ను ఇక్కడికి షిఫ్ట్ చేస్తే స మస్య తాత్కాలికంగా తీరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అద్దె భవనాలకు నెలానెలా ప్రభుత్వం చెల్లించే రెంట్తోనే ఈ భవనానికి మరమ్మతులు, మౌలిక వసతులు కల్పించవచ్చు.

విద్యార్థులు లేరనే సాకుతో పల్లెల్లో పాఠశాలలను మూసివేస్తున్న ప్రభుత్వం... 130 మంది విద్యార్థినులున్న చేవెళ్లలో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని వసతి గృహంగా మార్చకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చొరవ తీసుకుంటే బాలికల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ప్రపోజల్స్ పంపాం.. అనుమతుల కోసం ప్రపోజల్స్ పంపాం

‘మండల వృత్తి విద్యా కేంద్రం భవనాన్ని గరల్స్ హాస్టల్కు కేటాయించాలని కళాశాల ప్రిన్సిపాల్తో పాటు కలెక్టర్కు ప్రపోజల్ లెటర్ పంపాము. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి ఇంకా అనుమతులు రాలేదు. రూమ్లు బాగున్నాయి. శౌచాలయాలు, డోర్స్, తాగునీటి సౌకర్యం కోసం కొత్త బోర్ వేయించాల్సిన అవసరం ఉంది.‘

 వెంకట్, ఏఎస్ డబ్ల్యూ, చేవెళ్ల

వెంటనే భవనాన్ని హాస్టల్‌కు కేటాయించాలి

‘అద్దె భవనాల్లో సరైన వసతులు లేక 130 మంది విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వృత్తి విద్యా కేంద్ర భవనానికి ప్రహరీ గోడ, వాష్ రూమ్స్ నిర్మించి, బోర్ వేసి తాగునీటి సదుపాయం కల్పించాలి. గరల్స్ హాస్టల్కు సొంత భవనం కేటాయించేలా ఎమ్మెల్యే, మంత్రులు చర్యలు తీసుకోవాలి.‘

  బేగరి అరుణ్ కుమార్, SFI చేవెళ్ల డివిజన్ కార్యదర్శి