బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
సీఎం కుర్చీ ఖాళీ అవుతుందనే.. రాహుల్ కుర్చీకి ఎసరు
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కుంభకోణంలో(Kaleshwaram Scam) రేవంత్ రెడ్డే, కేసీఆర్ ను కాపాడుతున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఇప్పటివరకు కాళేశ్వరం గోదావరిలో కొట్టుకుపోయిందని చెప్పారు. ఒక్కో మోటారుపై రూ. 1300 కోట్ల మేర స్కామ్ జరిగిందన్నారు. రూ. లక్ష కోట్ల స్కాం అని చెప్పి.. సీబీఐకి రూ. 9 వేల కోట్లు జరిగిందని లేఖ రాశారని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల స్కామ్ జరిగిందని చెబుతున్నామన్నారు. రూ. 9 వేల కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రూ. లక్ష కోట్ల స్కామ్ అని విచారణ జరపాలా?, రూ. 9 వేల కోట్ల స్కామ్ అని విచారణ జరపాలా? రేవంత్ రెడ్డి చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఒక్కటే అన్నారు. ఒకరి అవినీతికి మరొకరు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో(KCR's Family) ఒక్కరిపై విచారణ జరపలేదు.. చర్య తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపలేమని ముక్కు నేలకు రావాలన్నారు. రెండు పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్కామ్ జరిగినట్లు లేఖ రాస్తే ఆ మేరకే విచారణ జరుగుతోందన్నారు. మిగతా మొత్తం స్కామ్ వివరాలు ఎలా తెలియాలి? అని ప్రశ్నించారు.
కేసీఆర్, రేవంత్ రెడ్డి కుమ్మక్కయినట్లు ప్రజల దృష్టికి తెస్తామని హెచ్చరించారు. హరీశ్ రావు విషయంలో కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ వైఖరి ఉందని బండి సంజయ్ సూచించారు. జీవన్ రెడ్డి చేరికను ఒప్పుకోక అలిగి వెళ్లినట్లు ఒకరు చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ అలయన్స్ కోసం వెళ్లారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి.. కలిసి అధికారం పంచుకున్నాయని తెలిపారు.
జమిలి ఎన్నికలు(Jamili Election) వస్తే బీజేపీ గెలుస్తుందనే ఆందోళనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని వివరించారు. సీఎం కుర్చీ ఖాలీ అవుతుందనే భయంతో రాహుల్ కుర్చీకి ఎసరు పెట్టారని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను వక్రీకరించారని బండి సంజయ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ విభజన వేళ కాంగ్రెస్ ఇష్టారీతిన వ్యవహరించిందని తేజస్వి చెప్పారని వివరించారు. దేశ, రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ సరిగా విభజన చేయలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. సోనియాగాంధీని బలి దేవత అన్న వ్యక్తి కేబినెట్ లో మంత్రులు ఉన్నారని తెలిపారు.






