14 August, 2026 | 9:31 PM

స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి

14-08-2026 08:14 PM

బోధన్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఎఫ్‌ఎస్‌సీ, స్మార్ట్ రేషన్ కార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బోధన్ అర్బన్ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులను తరలించేందుకు బోధన్ ఆర్డీవో ఎం. విజయకుమారి శుక్రవారం రేషన్ షాప్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు నిజామాబాద్‌లోని భూంరెడ్డి కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమానికి లబ్ధిదారులను తరలించేందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. 

జీపీవోలు, ఆర్‌ఐలు, తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, రేషన్ షాప్ డీలర్లు సమన్వయంతో పనిచేసి అర్హులైన లబ్ధిదారులు కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రూపొందించిన తుది జాబితాలోని అర్హులైన స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులకు రవాణా సౌకర్యం, భోజనం తదితర అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీవో అన్ని మండలాల తహసీల్దార్లతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ ఏర్పాట్లపై మార్గదర్శకాలు జారీ చేశారు.