14 August, 2026 | 9:31 PM

మిఠాయి భండార్ తయారీ యూనిట్‌పై ఎస్ఓటి దాడి

14-08-2026 08:32 PM

పోలీసుల అదుపులో మిఠాయి బండార్ యజమాని

తయారీకి సంబంధించిన స్వీట్లు, ముడి పదార్థాలు స్వాధీనం

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న 'న్యూ బాలాజీ హుక్మీచంద్ మిఠాయి భండార్' తయారీ యూనిట్‌పై శుక్రవారం ఎస్ఓటి ఉప్పల్ జోన్ బృందం దాడి చేసింది. అక్కడ గడువు ముగిసిన ముడి పదార్థాలు, నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను ఉపయోగించి అపరిశుభ్రమైన పరిస్థితులలో ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

దీని ఫలితంగా ఆహారంలో కల్తీ జరిగినట్లు అనుమానం కలుగుతోందన్నారు. మిఠాయి దుకాణం యజమాని (తయారీ యూనిట్) రాజారామ్ కచ్వా (48) ను ఆధీనంలోకి తీసుకొని అలాగే త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్స్ ఆరెంజ్ రెడ్ సూపర్ 2 బాక్సులు, త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో బాక్సులు, త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్ బ్లూ స్టార్ 100 గ్రాములు, 3 సీసాలు, నంది సింథటిక్ ఫుడ్ కలర్ (ఎరుపు, పసుపు) 2 సీసాలు, బుష్ సింథటిక్ ఫుడ్ కలర్ 5 పెట్టెలు, శ్రీబ్రాండ్ సిట్రిక్ యాసిడ్ 500 గ్రాములు 2 ప్యాకెట్లు, తయారీకి సంబంధించిన స్వీట్లు, ముడి పదార్థాలు. (గులాబ్ జామున్ స్వీట్, కలకనీ స్వీట్, బ్రౌన్ కలకండ్ స్వీట్, బాదం మిల్క్ స్వీట్స్, రసమలై స్వీట్స్,) అవసరమైన చట్టపరమైన చర్యల కోసం, ప్రతివాదిని స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఘట్కేసర్ పోలీసులు పేర్కొన్నారు.