14 August, 2026 | 9:14 PM

నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు

14-08-2026 08:08 PM

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

నార్సింగి /చేగుంట,(విజయక్రాంతి): నార్సింగి మండలం  జప్తి శివనూర్ గ్రామ శివారులో గల తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఎలాంటి అసైన్డ్  భూమి, కబ్జా చేయలేదని, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ శుక్రవారం మీడియా సమావేశంలో సర్పంచ్ నర్సిములు, గ్రామస్తుల సమక్షంలో మాట్లాడుతూ తాను కేవలం పట్టా భూమి మాత్రమే కొనుగోలు చేశానని, తన వ్యవసాయ భూమి నుండే రైతులకు దారి వదిలేశానని అన్నారు.

అనంతరం సర్పంచ్ నర్సింలు మాట్లాడుతూ ఈ విషయంలో పూర్తి అవగాహన లేకపోవడంతో తమవైపు పొరపాటు జరిగి, అపార్థం ఏర్పడిందని సర్పంచ్ నర్సిములు , ఉపసర్పంచ్ గంగమయ్య రాములు, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు తెలిపారు. రైతుల పొలాలకు వెళ్లే దారికి ఎలాంటి ఆటంకం లేదని, షబ్బీర్ అలీ తన సొంత ఖర్చులతో దారిని అభివృద్ధి చేయించారని, తన సొంత స్థలంలోనే ప్రహరీ గోడ నిర్మించుకున్నారని, ఎవరి భూమిని ఆక్రమించలేదని స్పష్టం చేశారు.

రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి, రైతుల దారిని ఎక్కడా మూసివేయలేదని నిర్ధారించారని పేర్కొన్నారు. అవగాహన లోపంతో జరిగిన అపార్థానికి గ్రామస్తుల తరఫున షబ్బీర్ అలీకి క్షమాపణలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. కొందరు వ్యక్తులు వాస్తవాలను పక్కనపెట్టి వివాదాన్ని అతిశయోక్తిగా ప్రచారం చేసి,షబ్బీర్ అలీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారని, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను గుర్తించాలని గ్రామ ప్రజలను కోరారు.