బెల్లంపల్లిలో ఘనంగా బక్రీద్ వేడుకలు
బెల్లంపల్లి, (విజయక్రాంతి): పట్టణంలో ఈద్-ఉల్-అజ్హా (బక్రీద్) పండుగ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ముస్లిం సోదరులు వేలాదిగా అశోక్‌నగర్ ఈద్గా మైదానానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక నమాజ్ (ప్రార్థనల)లో సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ అంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్ద నమాజ్ ముగిసిన తర్వాత ముస్లిం సోదరులు ఖబ్రస్థాన్‌కు చేరుకుని, తమ పూర్వీకులు, బంధువులు స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ వేడుకల సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు రాకేష్, అనూష, రాఘవేంద్రరావులు తమ సిబ్బందితో ఈద్గా వద్ద భద్రతను నిర్వహించారు. సివిల్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా బందోబస్తును పర్యవేక్షించారు. పలువురు పోలీస్ అధికారులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.






