1 August, 2026 | 9:41 AM

రూ.1.80 కోట్లతో తండాలకు మహర్దశ

01-08-2026 08:44 AM

 రేగళ్ళ పెద్ద తండా–మునియా తండా హై లెవెల్ బ్రిడ్జికి ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన

లక్ష్మీదేవిపల్లి ( విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ళ పెద్దతండా గ్రామపంచాయతీ పరిధిలోని రేగళ్ళ పెద్ద తండా నుండి మునియా తండా వెళ్లే ప్రధాన రహదారిపై రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న  హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కొత్తగూడెం నియోజకవర్గ  ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం రేగళ్ళ పెద్ద తండా సర్పంచ్ లావుడ్య పూర్ణ  అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.

సర్పంచ్ లావుడ్య పూర్ణ  మాట్లాడుతూ, కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు,  కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో,  రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. అనంతరం గ్రామ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే కి అందజేశారు.

వినతిపత్రంలో ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన రైతులకు పట్టా హక్కులు కల్పించడం, కేటీపీఎస్  ఎన్‌ఎండీసీ నవభారత్ పరిశ్రమల సమీపంలో గ్రామం ఉన్నందున సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం, అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహరీ గోడ నిర్మాణం, గ్రామంలో డ్రైనేజీల నిర్మాణం, గట్టుమల్ల ఆర్ అండ్ బి రోడ్ నుండి మునియా తండా వరకు బీటీ రోడ్డు, ఆశ్రమ హాస్టల్ నుండి శేఖరం బంజారా రైల్వే స్టేషన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. రేగళ్ల చెరువు నుండి కరకవాగు వరకు వేస్తున్నటువంటి బీటి రోడ్డు షోల్డర్ ఇరువైపులా చెరువు మట్టి వాడుతున్నారని నాణ్యత పరిణామాలోపం ప్లాస్టిక్ ఇండెక్స్ 6 శాతం కంటే తక్కువ ఉండదని భవిష్యత్తులో రోడ్డు కుంగిపోయే అవకాశం ఉందని ఇట్టి విషయాన్ని సంబంధిత అధికారులతో విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ని కోరడం జరిగింది.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  గ్రామ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, అన్ని పనులు పూర్తయ్యే వరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దూదియా తండా సర్పంచ్ బానోత్ రమేష్  బావోజి తండా సర్పంచ్ హాతిరాం , ట్రైబల్ డీఈ శ్రీకాంత్ , ఎమ్మార్వో , ఎంపీడీవో  ఎస్‌ఐ  ఉపసర్పంచ్ సునీత గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.