12 June, 2026 | 3:09 AM

ముమ్మరంగా బడిబాట కార్యక్రమం

12-06-2026 12:42 AM
  1. ప్రభుత్వ పంతుళ్ల వినూత్న ప్రచారం 
  2. విద్య సంవత్సరం ప్రారంభానికి సన్నద్ధం

మహబూబాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): విద్యా సంవత్సరం ప్రారంభానికి మరో మూడు రోజుల గడువు ఉండగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యా బోధనకు ప్రభుత్వ పాఠశాలలను సన్నద్ధం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యా ప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల నమోదును పెంచడానికి ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో గత విద్యా సంవత్సరం 762 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన చేయగా, ఆయా పాఠశాలల్లో 40,703 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఈ సంవత్సరం అదనంగా 10 శాతం విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయించింది.

అలాగే గత ఏడాది వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మూతపడ్డ 162 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు. వీటికి తోడు ఈ ఏడాది ఆధారంగా 76 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలో ప్రత్యేకంగా విద్యా బోధకులను, చిన్నపిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి సిబ్బంది నియామకం, ప్రత్యేక సౌకర్యాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టారు.

పాఠశాలలో చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత కు చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల ప్రహరీ గోడల నిర్మాణం, టాయిలెట్లకు మరమ్మతులు, తాగునీటి వసతి కల్పన, విద్యుత్ సౌకర్యం లాంటి పనులను చేపట్టారు. విద్యా బోధనకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఇప్పటికే పాఠశాలలకు సరఫరా చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టారు. 

విస్తృతంగా బడిబాట

జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ఈసారి వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల తోడ్పాటుతో ఆవాస ప్రాంతాల్లో బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించే విధంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో తమ పాఠశాలల్లో నిర్వహించిన బోధన తీరు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను,

ఫలితాల్లో తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు సాధించిన ఫలితాలను ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు, కొన్నిచోట్ల ప్రైవేటుకు దీటుగా కరప త్రాలను, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ప్రచారం సా గిస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల డబ్బు చప్పుళ్ళతో ప్రభుత్వ బడిలో చేరడానికి విస్తృతం గా ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తం గా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడి లో చేర్పించడానికి సమ్మతి తెలియజేస్తూ అంగీకార పత్రాలు ఇస్తున్నారు.

డప్పు కొట్టి ప్రచారం!

గూడూరు మండలంలోని పాటిమీది గూ డెంలో బడిబాట కార్యక్రమంలో భాగం గా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గోపీనా థ్ డప్పు కొడుతూ   ఊరి ప్రజలందరికి ప్ర భుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ ప్ర చారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి చక్కగా చదివించుకోవాలని అర్థమయ్యే రీతిలో వాడవాడలా ప్రచారం నిర్వహించాడు.