బీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మ
హైదరాబాద్: బీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు(BJP State President N. Ramachander Rao) ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా దమ్ముంటే, రాష్ట్రాన్ని దోచుకున్న ప్రాజెక్టుల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి క్షేత్రస్థాయిలో ఎప్పుడో గల్లంతైందన్న బీజేపీ చీఫ్ ఇప్పుడు ఆ పార్టీ కేవలం మీడియా, సోషల్ మీడియాకే పరిమితం అయిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సభలు భారీగా సక్సెస్ కావడం, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా బలపడటం చూసి ఓర్వలేకనే, బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఇస్తున్న తీర్పులను సైతం వక్రీకరిస్తూ వాళ్లు చేస్తున్న విష ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ నాయకులు కోట్లు ఖర్చుపెట్టి, పోస్టర్లు వేస్తూ విషప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.






