calender_icon.png 7 February, 2026 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 12న దేశవ్యాప్త సమ్మె: ఐఎఫ్టీయూ

07-02-2026 06:59:47 PM

నూతనకల్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ (IFTU) పిలుపునిచ్చింది. శనివారం నూతనకల్‌లో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఐఎఫ్టీయూ నాయకులు ఆవిష్కరించారు.​​

ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కేంద్రం వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందని మండిపడ్డారు.

ఈ కొత్త కోడ్‌ల వల్ల కార్మికులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోయి, యాజమాన్యాల వద్ద కట్టుబానిసలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.​ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు నకరికంటి సంజీవ, రవి, సైదులు, వెంకన్న, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు