20 August, 2026 | 4:14 AM

ఆందోల్‌లో కేజీబీవీలో బాలికల భద్రతపై అవగాహన

20-08-2026 12:17 AM

ఆందోల్ (సంగారెడ్డి), ఆగస్టు 19 : మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో  బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం అందోల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, బాలికల భద్రత మరియు సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టుకను గౌరవించడంతో పాటు ప్రతి బాలికకు నాణ్యమైన విద్య అందించడం, ఆమె ప్రతిభను ప్రోత్సహించడం, స్వయం సాధికారత సాధించేలా చేయడం సమాజం మొత్తం బాధ్యత అని తెలిపారు.

విద్య ద్వారా బాలికలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంతో పాటు ఉన్నతమైన కెరీర్ లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థినులు తమ ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా ఉన్నత విద్య, ఉపాధి, వివిధ వృత్తి అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. బాలికల భద్రత, రక్షణపై మాట్లాడుతూ విద్యార్థినులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అసౌకర్యం లేదా ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు నమ్మకమైన తల్లిదండ్రులు,

ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ, సీడీపీఓ మాధులిక, ఎంఆర్వో మధుకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎంఈఓ కృష్ణ, ఎస్‌ఓ జ్యోతి, ఇన్చార్జి ఎస్‌ఓ సుకన్య, మెడికల్ ఆఫీసర్ శంకర్, జిల్లా సమన్వయకర్త పల్లవి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎస్‌ఐ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, జెండర్ స్పెషలిస్ట్, విద్యార్థినులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.